అసెంబ్లీలో శుద్ధి దుమారం..కేసీఆర్ ఫాంహౌస్ రోడ్లను శుద్ధి చేయడంపై మంత్రుల ఫైర్ 

అసెంబ్లీలో శుద్ధి దుమారం..కేసీఆర్ ఫాంహౌస్ రోడ్లను శుద్ధి చేయడంపై మంత్రుల ఫైర్ 
  • శుద్ధి చేయాల్సింది బీఆర్​ఎస్​ నేతల బుద్ధిని: భట్టి
  • వివక్షను తెలంగాణ సమాజం సహించదని వ్యాఖ్య
  • బీజేపీ, బీఆర్‌‌ఎస్‌‌ భావజాలం ఒక్కటే : సీతక్క
  • కేసీఆర్ డైరెక్షన్​లోనే శుద్ధీకరణ: కోమటిరెడ్డి
  • సభ్య సమాజం తలదించుకునే అంశం: శ్రీధర్ బాబు

హైదరాబాద్‌‌, వెలుగు: కేసీఆర్‌‌ ఫామ్‌‌హౌస్‌‌ దగ్గర దళితులు డప్పు కొట్టి నిరసన వ్యక్తం చేసిన చోటును బీఆర్‌‌ఎస్‌‌ నేతలు పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేసిన ఘటన అసెంబ్లీని కుదిపేసింది. బుధవారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత ప్రారంభమైన సమావేశాల్లో గంటన్నరకుపైగా ఇదే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మంత్రులు సీతక్క, శ్రీధర్‌‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి, వాకిటి శ్రీహరి తదితరులు బీఆర్‌‌ఎస్‌‌ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులు ఫామ్‌‌హౌస్‌‌​వద్దకు వచ్చారనే  బీఆర్‌‌‌‌ఎస్​ నాయకులు శుద్ధి చర్యలకు పాల్పడ్డారని విమర్శించారు. చర్చ జరగనీయకుండా బీజేపీ ఎమ్మెల్యేలు ప్లకార్డులతో పోడియం ముందుకు వచ్చి నిరసన వ్యక్తం చేయగా.. వారిపై మంత్రులు మండిపడ్డారు. దళితులను కించపరిచే విషయంలో బీజేపీ, బీఆర్‌‌ఎస్‌‌ ఒక్కటేనని విమర్శించారు.  

దళితులను కించపరిచే విషయంలో బీఆర్‌‌ఎస్‌‌, బీజేపీ భావజాలం ఒక్కటేనని మంత్రి సీతక్క మండిపడ్డారు. ఉత్తరాఖండ్‌‌లో కాంగ్రెస్‌‌ జాతీయ అధ్యక్షుడు ఖర్గే మాట్లాడిన వేదికను అక్కడి బీజేపీ నేతలు పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేశారని, రాష్ట్రంలో కేసీఆర్‌‌ ఫామ్‌‌హౌస్‌‌ ముందు దళితులు డప్పు కొట్టిన ప్రాంతంలో బీఆర్‌‌ఎస్‌‌ నేతలు సైతం బీజేపీ వాళ్లలాగే ప్రవర్తించారని విమర్శించారు.  ఫామ్‌‌హౌస్‌‌కు 2 కిలోమీటర్ల దూరంలో 144 సెక్షన్‌‌ అమలు చేసి, కేసీఆర్‌‌కు రక్షణ కల్పించామని చెప్పారు. బీజేపీకి మద్దతుగానే బీఆర్‌‌ఎస్‌‌ నేతలు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

పసుపు నీళ్లతో శుద్ధి విడ్డూరం: కోమటిరెడ్డి

గడిచిన మూడు రోజులు గా రాష్ట్రంలో జరుగుతున్న దళిత వ్యతిరేక కార్య క్రమాలు చూస్తుంటే మనం ఏ యుగంలో ఉన్నామో తెలియడం లేదని మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌‌రెడ్డి అన్నారు. బీఆర్‌‌ఎస్‌‌ నేతలు అసెంబ్లీ మొదలైన తొలిరోజే స్పీకర్‌‌‌‌ను దూషించి అవమానించారని పేర్కొన్నారు. ఇందుకు బాధ్యత వహిస్తూ కేసీఆర్‌‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేస్తూ దళిత సంఘాల ఆధ్వర్యంలో డప్పులతో నిరసన తెలిపారన్నారు. కేసీఆర్‌‌ ఫామ్‌‌హౌస్‌‌ దగ్గరికి దళితులు వెళ్తే.. ఆ ప్రాంతంలో పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేయడం విడ్డూరమని పేర్కొన్నారు. కేసీఆర్‌‌ డైరెక్షన్‌‌లోనే ఈ పని చేశారని మండిపడ్డారు.

అంతా కేసీఆర్‌‌‌‌ డైరెక్షన్‌‌లోనే: వాకిటి

రాష్ట్రంలో దళితులు నడి చిన నేలపై పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేయించిన బీఆర్‌‌ఎస్‌‌ పార్టీ వైఖరిని సమాజం క్షమించబోదని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. కేసీఆర్‌‌ డైరెక్షన్‌‌లోనే తాము ఈ పని చేశామని స్వయంగా ఆ పార్టీకి చెందిన మహిళ అంగీకరించిందని పేర్కొన్నారు. ఇంతకంటే ఇంకా ఏం సాక్ష్యం కావాలని అడిగారు. కేసీఆర్‌‌ త్వరగా చనిపోవాలని ఆయన మేనల్లుడు హరీశ్‌‌రావు క్షుద్రపూజలు చేయిస్తున్నారని కవిత ఆరోపించిన ఆడియో క్లిప్పింగ్‌‌ను మంత్రి అసెంబ్లీలో చూపించారు. 

సభ్య సమాజం తలదించుకునేలా చేశారు: శ్రీధర్‌‌బాబు

దళితులు డప్పు కొట్టిన ప్రాంతంలో బీఆర్‌‌ఎస్‌‌ నేతలు పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేయడం దురదృష్టకరమని మంత్రి శ్రీధర్‌‌ బాబు అన్నారు. ఇది సామాజిక అంశమని, సభ్య సమాజం తలదించుకునేలా బీఆర్‌‌ఎస్‌‌ నేతలు వ్యవహరించారని మండిపడ్డారు. దీనిపై చర్చ జరుగుతున్న సమయంలో బీజేపీ ఎమ్మెల్యేలు అడ్డుకోవడం సరికాదన్నారు. తాను ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజల ఆదరాభిమానాలు పొందడానికి ఎంతగానో శ్రమిస్తానని అన్నారు.